వివాదాస్పద సింగూర్ సమస్యకు సోమవారం పరిష్కార మార్గం లభించవచ్చని పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా సాగుతున్న చర్చలు ఆదివారం కూడా సాగుతాయని, ఫలితం మాత్రం సోమవారానికి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగూర్‌లో టాటా యాజమాన్యం తలపెట్టిన నానో కార్ల ఫ్యాక్టరీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అడ్డుతగిలిన విషయం తెల్సిందే.
దీంతో ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులను ఆహ్వానించి గవర్నర్ చర్చలు జరుపుతున్నారు. ఇందులోభాగంగా శనివారం రెండో దఫా చర్చలు ముగిశాయి. ఈ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండో దశ చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని, తర్వాతి దశ చర్చలు ఆది, సోమవారాల్లో కూడా సాగుతాయని చెప్పారు. ఇదే మీకు నేను చెప్పదలచుకున్నట్టు గాంధీ వివరించారు.
ఇదే సహకారంతో చర్చలు జరిగిన పక్షంలో సంతృప్తికరమైన ఫలితం వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమస్య పరిష్కారానికి ఇరు పార్టీలు అధిక చొరవ చూపిస్తున్నాయన్నారు. సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల బాధితులకు కల్పించే పునరావాసంపై ఇరు వర్గాల ప్రతినిధులు లోతుగా పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
నానో ప్రాజెక్టును వేరే చోటికి మార్చాలని టాటా ఛైర్మన్ రతన్ టాటా ప్రకటించిన వెంటనే గవర్నర్ గాంధీ మధ్యవర్తిగా రంగ ప్రవేశం చేసిన విషయం తెల్సిందే. అయితే గవర్నర్ మధ్యవర్తిత్వంతో పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడ్డాయి. బాధితులకు తగిన నష్టపరిహార ప్యాకేజీతో పాటు.. పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం, టాటా యాజమాన్యం అంగీకరించింది.
|