కల్లోలిత రాష్ట్రంగా పేరుగాంచిన జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆ రాష్ట్ర రాజకీయ పార్టీల నేతలతో సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ముందస్తు ఎన్నికలకు పిడిపి ఆసక్తి చూపక పోవడం గమనార్హం.
అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూముల కేటాయింపు, రద్దు వ్యవహారంపై హింస చెలరేగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికల డిమాండ్ తెరపైకి రావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఏడాది ఆఖర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సోమవారం ఎన్నికల సంఘంతో జరిగే సమావేశంలో ముందస్తు ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు డిమాడ్ చేయనున్నాయి.
ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. భీంసింగ్ నేతృత్వంలోని పాంథర్స్ పార్టీ, సీపీఎం, ఇతర చిన్న పార్టీలు కూడా దాదాపు ఇదే డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో ఎన్నికల సంఘం కూడా ముందస్తు ఎన్నికల వైపే మొగ్గు చూపే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే పిడిపి మాత్రం ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఎన్నికల సంఘం ముందు తన వాణిని గట్టిగా వినిపించనుంది.
|