భవిష్యత్ అవసరాల నిమిత్తమే భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మరోమారు పునరుద్ఘాటించారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ ఒప్పందం కుదుర్చుకోవడం హర్షదాయకమన్నారు. ముఖ్యంగా.. ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలో అణు ఒప్పందం కుదుర్చుకోవడం చారిత్రాత్మక ఘట్టంగా సోనియా పేర్కొన్నారు.
సోమవారం బికనీర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అణు ఒప్పందం వల్ల దేశానికి వనగూరే ప్రయోజనాలను వల్లె వేశారు. తాజాగా ఒప్పందానికి న్యూక్లియర్ సరఫరా సభ్య దేశాల కూటమి ఆమోదముద్ర వేసిందని, అలాగే అమెరికా కాంగ్రెస్ కూడా ఒప్పందానికి అంగీకారం తెలుపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒప్పందం కోసం దేశ సార్వభౌమత్వాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తాకట్టుపెట్టబోదని ఆమె స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష పార్టీలు దేశ ప్రగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అణు ఒప్పందం వల్ల దేశానికి చేకూరే ప్రయోజనాలు దేశ ప్రజలు త్వరలోనే అనుభవిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మన్మోహన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
|