ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ అధినేత రాజ్ థాకరే మండిపడ్డారు. మరాఠీలతో కలిసి ఉంటూ తాము హిందీలోనే మాట్లాడుతాం అంటూ జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ బచ్చన్ కుటుంబం హిందీ మాట్లాడాలనుకుంటే ఉత్తరప్రదేశ్ వెళ్లిపోవాలని సూచించారు. బచ్చన్ చేసిన ఈ ప్రకటనపై మరాఠీలు స్పంధించాలని వారి కుటుంబం నటించి ప్రకటనలకు సంబంధించిన వస్తువులను మరాఠీలెవరూ కొనుగోలు చేయరాదని ఆయన పిలుపునిచ్చారు.
బచ్చన్ కుటుంబం ముంబాయిలో ఉంటూ ఎంతసేపూ ఉత్తర ప్రదేశ్ గురించే మాట్లాడుతోందని ఆయన ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఓ సినిమా వేడుకలో భాగంగా జయాబచ్చన్ మాట్లాడుతూ తాము ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చామని అందువల్ల హిందీలోనే మాట్లాడుతామని అన్నారు.
జయాబచ్చన్ వ్యాఖ్యలు మరాఠీలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ శివసేన, ఎంఎన్ఎస్ పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. జయాబచ్చన్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర ప్రజలు ఏ విధంగానూ క్షమించరని ఆ పార్టీలు పేర్కొన్నాయి.
|