బెంగుళూరులో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యూపీఏ సర్కారు విధానాలను తూర్పారబట్టారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షిస్తోందని కమలనాథులు ధ్వజమెత్తారు. దేశ విదేశాంగ విధానం అధ్వాన్నంగా తయారయిందని దుయ్యబట్టింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న తీవ్రవాద సంస్థ సిమీపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడుతోందని భాజపా ఆరోపించింది.
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం నుంచి బెంగుళూరులో ప్రారంభమైన విషయం తెల్సిందే. ఆదివారంతో ఈ సమావేశాలు ముగుస్తాయి. ఇందులో ఆ పార్టీ అగ్రనేతలైన అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, జస్వంత్ సింగ్, వెంకయ్య నాయుడు వంటి సీనియర్ నేతలతో పాటు.. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశాల తొలి రోజున భారత్-అమెరికా అణు ఒప్పందంపై చర్చించిన భాజపా.. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సాగాయి. ప్రస్తుత అణు ఒప్పందం వల్ల దేశ సార్వభౌమాధికారానికి హాని కలుగుతుందని, అందువల్ల తాము అధికారంలోకి వస్తే ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తామని కమలనాథులు ప్రకటించారు.
|