సింగూర్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వచ్చే 16వ తేదీన సింగూర్‌కు ర్యాలీగా వెళ్లనున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అంతేకాకుండా గవర్నర్ సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని లెఫ్ట్ ప్రభుత్వం ఉల్లంఘించిందని అందువల్ల తదుపరి చర్చలకు ఏమాత్రం ఆస్కారం లేదని ఆమె తేల్చి చెప్పారు.
తమను సంప్రదించకుండానే బెంగాల్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు. దీనిపై ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమను సంప్రదించకుండానే ముఖ్యమంత్రి స్వతహాగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఏర్పడిన ఒప్పందాన్ని వారు ఉల్లంఘించారన్నారు.
ఈనెల 16వ తేదీన సింగూర్‌కు ర్యాలీగా వెళుతామని, తదుపరి ఆందోళనపై 19వ తేదీ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ ప్రకటించారు. మమతా బెనర్జీ బెంగాల్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన మరుక్షణమే లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బోస్ స్పందించారు.
టాటా ప్రాజెక్టుకు కేటాయించిన భూమి నుంచి 70 ఎకరాలకు మించి తిరిగి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. నష్టపరిహార ప్యాకేజీని కూడా మరింత పెంచినట్టు బిమన్ బోస్ వివరించారు. అయితే.. టాటా ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ ప్రాజెక్టులను సింగూర్ నుంచి తొలగించాలని మమతా బెనర్జీ చేస్తున్న డిమాండ్‌ను బోస్ తోసిపుచ్చారు.
|