దేశ పార్లమెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అన్ని సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అనేది అసాధ్యమన్నారు. అయితే రాజకీయ నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన పక్షంలో ఇది సాధ్యపడుతుందన్నారు.
ఏడాది పొడవునా ఎన్నికలు నిర్వహించుకుంటూ పోతే మనం ఏవిధంగా అభివృద్ధి చెందుతామని ఆయన ప్రశ్నించారు. దేశ అభివృద్ధికి ఎన్నికలు నిర్వహణ ఆటంకం కాకూడదన్నారు. కలాం అభిప్రాయంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి జైపాల్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పికే.ధుమాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులు ఏకీభవించారు.
ఆయా సభలకు ముగుస్తున్న కాలపరిమితిని దృష్టిలో ఉంచుకుని లోక్‌సభకు, రాష్ట్రాలకు వివిధ సమయాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. దీనివల్ల సమయంతో పాటు నిధులు కూడా భారీగా దుర్వినియోగం అవుతోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా లోక్‌సభ, రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించాలని అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు.
|