తమ ప్రతిష్టాత్మక నానో ప్రాజెక్టును సింగూరు నుంచి తరలించేందుకే టాటా సంస్థ సిద్ధమైంది. నానో ప్రాజెక్టును సింగూరు నుంచి తరలించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని టాటా అధినేత రతన్ టాటా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కంపెనీ, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సింగూరు నుంచి తమ నానో ప్రాజెక్టును తరలిస్తున్నామని స్పష్టం చేశారు.
అయితే ఈ ప్రాజెక్టును ఎక్కడకు తరలించాలనే విషయంలో మాత్రం తామింకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. నానో ప్రాజెక్టుకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో గత నాలుగురోజులుగా చర్చలు జరిగాయని అయితే అవేవీ తమకు సంతృప్తిని ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుందని తాము ఎదురుచూశామని అయితే తాము ఆశించిన ఫలితాలు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సింగూరు నుంచి నానో తరలిపోకుండా ఉండేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ చాలా ప్రయత్నించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మధ్య తరగతి కలల కారుగా ప్రచారంలోకి వచ్చిన నానోను నవంబర్ నాటికి రోడ్డు మీదకు తెచ్చేందుకు టాటా ప్రయత్నాలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానో నానోకు సంబంధించిన ప్రాజెక్టును టాటా సింగూరులో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొంత భూమిని టాటాలకు కేటాయించింది.
ఇందులో నానోకు సంబంధించిన నిర్మాణాలు కూడా కొంత మేర జరిగాయి. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టాటాలకు కట్టబెట్టిన భూమి రైతులకు సంబంధించిందని పచ్చటి పొలాలను పరిశ్రమలకు అప్పగించడం న్యాయం కాదంటూ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఉద్యమం లేవదీశారు.
ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో నానో ప్రాజెక్ట్ పనులు ఎక్కడివక్కడ నిల్చిపోయాయి. అంతేకాకుండా ప్రాజెక్టులో పనిచేసే కార్మికులపై ఉద్యమకారులు ఆందోళలనకు దిగడంతో టాటా కంపెనీ నానో ప్రాజెక్టును తరలించేందుకు సిద్ధమైంది. అయితే నానో ప్రాజెక్టును రాష్ట్రం నుంచి తరలిపోకుండా చేయడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఆయన టాటా కంపెనీతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. |