దేశంలోని బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో మంగళూరులో శుక్రవారం కొంతమంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాము అరెస్ట్ చేసిన వారి వివరాలను వెల్లడిస్తూ శుక్రవారం సాయంత్రం పోలీసుశాఖ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
పోలీసుశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం అరెస్టు చేసిన వారి నుంచి పెద్ద ఎత్తున విధ్వంసకారక వస్తువులు లభించినట్టు తెలుస్తోంది. మంగళూరు పట్టణంలోని అనేక ప్రాంతాల్లో డీకే జిల్లా పోలీసులు, యాంటీ నక్సల్ పోర్స్, ముంబై పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.
పోలీసుల సోదాలో పట్టుబడిన వారిలో 56 ఏళ్ల మహ్మద్ అలీ అనే ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్, జావేద్ అలీ అనే 20 ఏళ్ల విద్యార్ధి, 25 ఏళ్ల నౌషద్ అనే ఇంజనీర్, అహ్మద్ బవా అనే 33 ఏళ్ల ఓ వ్యాపారి ఉన్నారు. వీరిని అరెస్టు చేసిన సమయంలో వీరి వద్ద నుంచి ఓ కంప్యూటర్ హార్డ్ డిస్క్‌తో పాటు జిహాదీకి సంబంధించిన సాహిత్యం, ఇస్లాం మత సంబంధ పుస్తకాలు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వస్తువులన్నీ మహ్మద్ అలీ నివాసంలో పోలీసులకు లభించాయి. అలాగే నౌషద్ వద్ద నుంచి పల్సర్ మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లు, డైరీలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు పెద్ద మొత్తంలో నగదు కూడా పోలీసుల చేతికి చిక్కడం గమనార్హం.
పోలీసుల చేతికి చిక్కిన ఈ అనుమానితులకు ఇటీవల దేశవ్యాప్తంగా సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలతో ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. |