శ్రీలంక తమిళుల ప్రాణాలు కాపాడేందుకు గాను లోక్‌సభలో ప్రతిపక్ష నేత, బిజెపి తరపున ప్రధాని పదవికి అభ్యర్థి అయిన ఎల్ కె అద్వానీ శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపాక్షేతో ట్రాక్ టూ దౌత్యానికి నడుం బిగించారు. శ్రీలంక తమిళులు సురక్షితంగా ఉండాలని అద్వానీ కోరుకుంటూనే ఈ సమస్యపై భారతీయుల ఆందోళనలను అర్థం చేసుకోవటంలో రాజపాక్షే వాస్తవిక ధోరణిని అవలంబించాలని ఆకాంక్షిస్తున్నారు. బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా ఉండే మాజీ భారత రాయబారి ఎన్ఎన్ ఝా ప్రస్తుతం రాజపాక్షే ఆహ్వానం మేరకు శ్రీలంకలో ఉన్నారు. గతంలో శ్రీలంకలో భారత రాయబారిగా పనిచేసిన ఝా త్వరలో జరుగనున్న భారత శ్రీలంక ఫోరం సమావేశంలో పాల్గొననున్నారు. శ్రీలంక తమిళుల ప్రాణాలు కాపాడటం, అదే సమయంలో శ్రీలంక ప్రాదేశిక సమగ్రత దెబ్బతినకుండా చూడటం అనేవే బీజీపీ రెండంచెల దౌత్యంలో భాగం. ప్రస్తుతం ఝా శ్రీలంక పర్యటనను ఈ వెలుగులోనే అర్థం చేసుకోవాలని పరిశీలకుల వ్యాఖ్య.గురువారం ఉదయం శ్రీలంక అధ్యక్షుడితో భేటీ అయిన ఝా భారత్ శ్రీలంక సంబంధాల సంపూర్ణ చరిత్రను ఆయనతో చర్చించారు. లంక తమిళులు సంక్షేమానికి, భద్రతకు హామీ ఇవ్వడం ద్వారా భారత్-శ్రీలంక ప్రయోజనాలను మెరుగుపర్చే పథకాలను గురించి ఝా లంక అధ్యక్షుడితో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |