చిరుతిళ్లు, మద్యం లాంటివి దేశ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్బుమణి రాందాస్ పేర్కొన్నారు. అందుకే చిరుతిళ్లు, మద్యం, మత్తు పదార్థాలు లాంటివాటిని దశలవారీగా నియత్రంచాల్సిన అవసరం ఉంది ఆయన పేర్కొన్నారు.
ఈ విషయమై ముంబయిలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి రాందాస్ మాట్లాడుతూ చిరుతిళ్లు, మద్యం, మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి యువత తల్లితండ్రులకు తెలియడం లేదని పేర్కొన్నారు. అందుకే ఈ విషయం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని అన్నారు.
గతంలో పొగతాగడం ద్వారా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, దీనివల్ల చుట్టుపక్కలవారి ఆరోగ్యం సైతం బాధించబడుతోందన్న కారణంగా బహిరంగ ప్రదేశాల్లో పొగ నిషేధం చట్టాన్ని అమలులోకి తెచ్చేలా చేసిన రాందాస్ తాజాగా చిరుతిళ్లు, మద్యం వ్యసనాలపై కూడా దృష్టి సారించడం గమనార్హం. |