త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ఆరంభమవుతుందని కేంద్ర రైల్వే శాఖామంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచన ప్రాయంగా వెల్లడించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ రాష్ట్రాలకు ఈ నెలలో ఎన్నికలు జరుగునున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రాల ఓట్ల లెక్కింపు వచ్చే నెల ఎనిమిదో తేదీన జరుగుతుంది. ఈ ఫలితాలు యూపీఏకు అనుకూలంగా వచ్చిన పక్షంలో ఫిబ్రవరిలో లోక్‌సభకు ఎన్నికలు జరుగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి లాలూ చేసిన వ్యాఖ్యలు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇకపోతే.. మహారాష్ట్రలో ఉత్తరాదివారిపై జరుగుతున్న దాడుల పట్ల లాలూ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున్న మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అడ్డంకిగా మారుతున్నారని లాలూ ఆరోపించారు. ఈ విషయంలో అన్ని పార్టీల ఐక్యతకు నితీష్ కుమార్ గండి కొడుతున్నారని ఆరోపించారు. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని మతోన్మాద శక్తులు కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. అలాంటి శక్తులను ఉపేక్షించరాదని ఆయన పిలుపునిచ్చారు. |