తన అరెస్టు కోసం వేచి చూస్తున్నట్టు శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్‌థాక్రే ప్రకటించారు. అంతేకాకుండా మాలేగావ్ బాంబు పేలుళ్ళ కేసులో మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం (ఏటీఎస్) అరెస్టు చేసిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ను విడుదల చేయించేందుకు పేరొందిన న్యాయవాదిని నియమించేందుకు తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌కు బహిరంగ మద్దతు ప్రకటించినందుకు గాను బాల్‌థాక్రేను తక్షణం అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ గురుదాస్ కామత్ సోమవారం డిమాండ్ చేసిన విషయం తెల్సిందే.
దీనిపై థాక్రే తీవ్రంగానే స్పందించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, అరెస్టు కోసం వేచి చూస్తున్నట్టు పార్టీ పత్రిక సామ్నాలో పేర్కొన్నారు. అదేసమయంలో తనను ఏ కారణంతో అరెస్టు చేస్తున్నారో కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
హిందుత్వవాదానికి మద్దతు తెలిపినందుకా? లేదా ముస్లిం తీవ్రవాదాన్ని వ్యతిరేకించినందుకా? అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన సూచించారు. సాధ్వీ వ్యవహారంలో తనను అరెస్టు చేసిన పక్షంలో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంకు పెరుగుతుందని థాక్రే అభిప్రాయపడ్డారు. |