చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం కావడంతో భారతీయుల ఘనత విశ్వాంతరాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. చంద్రునిపై పరిశోధనలకోసం ఉద్దేశించిన ఈ చంద్రయాన్-1 విజయవంతం కావడంతో రెండో దశ పరిశోధనకుగాను చంద్రయాన్-2 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ విషయమై చంద్రయాన్-1కి పథక అధికారిగా వ్యవహరించిన మయిలస్వామి, అన్నాదురైలు సోమవారం కోయంబత్తూర్‌లో మాట్లాడుతూ... చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం కావడంతో రెండో దశ ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
చంద్రయాన్-2కు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అదేసమయంలో ఇస్రోలో ఇప్పటికే చంద్రయాన్-2కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించబడుతోన్న ఈ చంద్రయాన్-2 ప్రయోగాన్ని 2011-12 ప్రాంతంలో చేపట్టనున్నామన్నారు. |