రాజకీయాల్లో పేరుకుపోతోన్న కుళ్లును తొలగించాలంటే అది యువతతోనే సాధ్యం అని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఒక్క యువత చేతిలోనే ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ సదస్సులో నైతిక విలువల పతనం- దిద్దుబాటు అనే అంశంపై అద్వానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుత్సిత రాజకీయ నేతలు అనే అపవాదు నుంచి బయటపడేందుకు భారత్‌లోని రాజకీయ నేతలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ రూపొందించే అవినీతికర దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానాల్లో నిలుస్తుండడం, మానవాభివృద్ధి నివేదికల్లో అట్టడుగు స్థానాల్లో నిలుస్తుండడంపై ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నేతల్లో వృత్తిపరమైన బాధ్యత కొరవడడం వల్లే ఈ తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
స్వాంతంత్ర ఉద్యమ కాలంలో రాజకీయాలు గౌరవప్రదంగా ఉండేవని అయితే నేడు ఆ పరిస్థితి అంతరించిందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లోనూ విలువలు పతనం దిశగా సాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మనిషి తన మేధాశక్తిని జీవిత పర్యంతం అభివృద్ధి చేసుకోవచ్చని అయితే భావోద్వేగం, నైతిక విలువల నిబద్ధత అనేది యుక్తవయస్సులోనే సాధ్యమని అద్వానీ అన్నారు. అందుకే దేశంలో రాజకీయ మార్పుకు యువత ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. |