చెన్నైలోని అంబేద్కర్ న్యాయ కళాశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కరుణానిధికి ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లీగల్ నోటీసు పంపించారు. ఈ ఘర్షణల వెనుక ప్రతిపక్ష పార్టీల పాత్ర ఉందని ముఖ్యమంత్రి కరుణానిధి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
24 గంటల్లో కరుణానిధి క్షమాపణ చెప్పని పక్షంలో ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత హోదాను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై రూ.కోటి మేరకు పరువునష్టం దావా వేయనున్నట్టు ప్రకటించారు. ఈ విద్యార్థుల దాడుల వెనుక డీఎంకే హస్తం ఉందని జయలలిత మంగళవారం ఆరోపించిన విషయం తెల్సిందే.
దీంతో కరుణానిధి కూడా అన్నాడీఎంకేపై విమర్శలు చేశారు. ఇటీవల చెన్నై న్యాయకళాశాలలో రెండు వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఘర్షణలు కుల ఘర్షణలుగా మారాయి. ఇవి దక్షిణాది జిల్లాలకు కూడా ప్రాకాయి. |