పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సీపీఎం నేత జోహార్ అలీ హత్య కేసులో నిందితులైన 21 మందికి ఆరాంబాగ్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు నిందితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీపీఎం నేత జోహార్ అలీని అదే పార్టీకి చెందిన 21 మంది కార్యకర్తలు 2006 మే 25న బులుంది గ్రామంలో హత్య చేశారు. పార్టీలోని అంతర్గత కక్షల కారణంగా అస్గర్ అలీ నేతృత్వంలోని మరో 20మంది జోహార్‌ను హత్య చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు.
ఆనాటి నుంచి నేటివరకు నడుస్తూ వచ్చిన ఈ కేసుకు సంబంధించి ఆరాంబాగ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం తన తీర్పును ప్రకటించింది. ప్రభుత్వ తరపు న్యాయవాది అబ్దుల్ షమద్ చేసిన ఆరోపణలను, 20 మంది సాక్షుల వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయవాది గౌతమ్ సేన్ గుప్తా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తన తీర్పును ప్రకటించారు.
అయితే ఈ కేసులో నిందితుల తరపున వాదించిన స్వపన్ ఘోష్ మాట్లాడుతూ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరాంబాగ్ కోర్టు ప్రకటించిన జీవితఖైదు తీర్పును తాము పై కోర్టులో సవాలు చేయనున్నట్టు ఘోష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. |