నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా గురువారం మలివిడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ చివరి దశ పోలింగ్‌లో మొత్తం 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 50 మంది మహిళా అభ్యర్థులతో పాటు.. 687 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 88,14,228 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కాగా, ఈ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగీ, ఆయన సతీమణి రేణుజోగీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వైష్ణుడియో సాయ్, డిప్యూటీ స్పీకర్ భద్రీదర్ దివాన్, హోం శాఖామంత్రి రామ్‌వీచర్ నేతమ్, ఆరోగ్య మంత్రి అమర్ అగర్వాల్, యుధ్వీరి సంగ్ జుడియో కుమారుడు దిలీప్‌సింగ్, మాజీ హోం మంత్రి నందకుమార్ పటేల్‌లు ఉన్నారు.
ఎన్నికల జరిగే రాయ్‌పూర్, బిలాస్‌పూర్, కోర్బా, రాయ్‌గర్, సర్గుజా, కోరియా, జాస్పూర్, జాన్‌గిర్, ఛాంపా జిల్లాల్లో 12,073 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వీటిలో 2608 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగాను, 355 పోలింగ్‌బూత్‌లు అత్యంత సమస్యాత్మకమైనవిగా ప్రకటించారు. కాగా, ఈనెల 14వ తేదీన జరిగిన తొలి దశ ఎన్నికల్లో 39 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగగా, 55 శాతం పోలింగ్ నమోదైంది. |