మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులగా పేర్కొంటూ మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) పోలీసులు అరెస్టు చేసినవారిపై మోకా చట్టం ప్రయోగించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన చేసింది.
ఈ విషయమై ఏటీఎస్ ప్రధానాధికారి హేమంత్ కర్ఖారే మాట్లాడుతూ మాలేగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయినవారిపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం (మోకా) కింద విచారణకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. మాలేగావ్ పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 10మందిని నిందులుగా అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
వీరిలో సాధ్వీ ప్రజ్ఞా సింగ్, దయానంద్ పాండేలాంటి ఆధ్యాత్మిక గురువులతో పాటు సమీర్ కులకర్ణి, సైనికాధికారి శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌లాంటి సైనికాధికారుల పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు అరెస్ట్‌కాబడిన వీరిలో పురోహిత్‌ను రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలిస్తూ బుధవారం కోర్టు నిర్ణయం తీసుకుంది.
అలాగే మరో నిందితుడైన సమీర్ కులకర్ణిని కూడా ఓ రోజుపాటు పోలీసు కస్టడీకి తరలించారు. ప్రస్తుతం వీరిపై భారత పేలుళ్ల చట్టం పరిధిలో కేసులు నమోదు చేసినా వీరందరిపై మొత్తంగా మోకా చట్టాన్ని ప్రయోగించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు.
గత సెప్టెంబర్ 29న మాలేగావ్‌లో జరిగిన పేలుళ్ల ఘటనలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు దర్యాప్తుకు ఆదేశించింది. |