దేశ భద్రత కోసం సరిహద్దుల్లో నిత్యం కాపలాకాసే సైనికులు సెల్‌ఫోన్ల వాడకాన్ని తగ్గించాల్సిందిగా ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ విజ్ఞప్తి చేశారు. సైనికులు సెల్‌ఫోన్లను పదేపదే వాడడం వల్ల వారిలో ఆందోళన పెరిగి అది వారి వృత్తిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందని రామ్‌దేవ్ అభిప్రాయపడ్డారు.
కేంద్రానికి చెందిన పారా మిలటరీ దళాలకు రామ్‌దేవ్ ఆధ్వర్యంలో ఇటీవల పదిరోజుల పాటు యోగా శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు నాలుగువేల మంది సైనికులు పాల్గొనడం విశేషం. ఈ శిభిరం సందర్భంగా రామ్‌దేవ్ మాట్లాడుతూ సెల్‌ఫోన్ల వాడకం వల్ల కుటుంబంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా సైనికులకు వెంటనే తెలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కారణంగా వారు ఏకాగ్రత కోల్పోయి ఒత్తిడికు గురవుతున్నారని ఆయన అన్నారు. హోంమంత్రిత్వ శాఖ అధికారులు సైతం రామ్‌దేవ్ అభిప్రాయాలను అంగీకరిస్తున్నారు. వీరి వివరణ ప్రకారం కొందరు సైనికులు తమ కుటుంబంతో 5-10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
జవాన్లు సెల్‌ఫోన్లు వాడడంపై ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వీటిని ఉపయోగిస్తన్నారని వారు పేర్కొన్నారు. |