దేశంలో యురేనియం నిక్షేపాలు అపారంగా ఉన్నాయని భారత అణుశక్తి కమిషన్ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ అభిప్రాయపడ్డారు. ఈ నిక్షేపాలను గుర్తించేందుకు పరిశోధన చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం వచ్చే 11వ పంచవర్ష ప్రణాళిక లో రూ.800 కోట్లను కేంద్ర కేటాయించిందని ఆయన వివరించారు. ఆయన గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా యురేనియం నిక్షేపాలను వెలికితీయవలసిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడప, మేఘాలయలోని మెహదెక్ బేసిన్, ఉత్తర ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లలో యురేనియం నిక్షేపాలు అపారంగా ఉన్నట్టు గుర్తించినట్లు కకోద్కర్ వివరించారు. అయితే ఈ నిక్షేప నిల్వల పరిమాణం, వాటి నాణ్యతపై ఒక సమగ్రమైన అధ్యయనం నిర్వహించాల్సి ఉందన్నారు. ఇకపోతే భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం అమలు త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. దీనివల్ల భారత్‌కు అవసరమైన ఇంధన వనరులను పుష్కలంగా తయారు చేసుకోగలదని కకోద్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. |