దేశంలో పెనుసంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుళ్ళ కేసులో అరెస్టు చేసిన సాధ్వి ప్రజ్ఞాసింగ్‌తో పాటు ఇతర నిందితులపై మహారాష్ట్ర సమీకృత నేరాల చట్టం (మోకా)ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. ఈ చట్టం ప్రయోగించిన వారిలో ప్రజ్ఞాసింగ్‌తో సహా, మత గరువురు దయానంద్ పాండే, ఆర్మీ అధికారి ఒకరు ఉన్నారు. వీరిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ చట్టం నిబంధనల మేరకు ఒక వ్యక్తి మరణానికి ఎవరైనా కారణభూతులైనట్టయితే.. వారికి గరిష్టంగా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నేరం రుజువైతే జీవిత ఖైదు, నేరాల్లో పాలుపంచుకున్నట్లు తేలితే ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తారు. కాగా, మాలేగావ్ పేలుళ్ళ కేసులో ఇప్పటి వరకు మొత్తం పది మందిని మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక (ఏటీఎస్) అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
పేలుళ్ళపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్టు ఏటీఎస్ జాయింట్ కమిషనర్ హేమంత్ కర్కారే వెల్లడించారు. పురోహిత్‌కు, సుధాకర్ చతుర్వేదికి సంబంధాలు ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైనట్టు ఆయన తెలిపారు. |