అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రభావం భారత్‌పై ఉన్నప్పటికీ.. దీని నుంచి గట్టెక్కే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆయన నొక్కివక్కాణించారు. హిందూస్థాన్ టైమ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం భారత్‌పై పాక్షికంగా ఉన్నప్పటికీ.. ఎనిమిది శాతం వృద్ధి రేటును చేరుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేసమయంలో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అవసరమైన వ్యూహాలను నిపుణులు రచించాల్సి వుందన్నారు. సంక్షోభ నివారణకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా ముందుకుసాగాలని జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో తీర్మానించాయని ఆయన గుర్తు చేశారు. కలిసి కట్టుగా ముందుకు సాగిన పక్షంలో గండం నుంచి గట్టెక్కడం పెద్ద సమస్య కాబోదన్నారు. అదేసమయంలో అంతర్జాతీయ సమాజం మరో పెనుముప్పును ఎదుర్కోనుందన్నారు. అదే.. మతం పేరుతో సాగుతున్న ఉగ్రవాదం అని చెప్పుకొచ్చారు. మతం పేరుతో సాగించే తీవ్రవాద రాజకీయాలు దేశాన్నే కాకుండా ప్రపంచంలో అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తాయని ప్రధాని చెప్పుకొచ్చారు. |