జీవితాంతం పార్లమెంటు సభ్యుల బట్టలుతుకుతూ కాలం వెళ్ళబుచ్చడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.. 32 సంవత్సరాల ముహమ్మద్‌తాహిర్ అనే ధోబి. ఇతను రాష్ట్రపతి భవన్ సమీపంలోని నార్త్ అవెన్యు కాలనిలో పార్లమెంట్ సర్వెంట్స్ క్వార్టర్స్‌లో నివశిస్తున్నాడు.
ఆల్‌ఇండియా మైనారిటీస్ ఫ్రంట్ (ఏ.ఐ.ఎమ్.ఎఫ్.) తరపున ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై పోటీచేస్తున్నాడు. తనను గెలిపిస్తే సమాజంలో పేదలపట్ల ఉండే అంతర్యాన్ని రూపుమాపుతానని అన్నారు. పేదల ప్రతినిధిగా చట్టసభలో తనవాణి వినిపిస్తానని, నేనుగెలుస్తానా లేదా అనే విషయం కన్నా పేదల తరపున పోరాడుతానని తెలిపారు. తన ధువులు, మిత్రుల వలన ఖచ్చితంగా 2500 ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు.
అలాగే ఇదే స్థానం నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై మరో తొమ్మిది మంది మహిళలు కూడా పోటీ చేస్తుండడం గమనార్హం. ఏ.ఐ.ఎమ్.ఎఫ్ అధ్యక్షుడు ఏ.ఎమ్.ఆసిఫ్ మాట్లాడుతూ ధనిక, పేద అనేతేడా లేకుండా ఎవరైనా ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఈ దేశంలో మాత్రమే ఉందని, ఇది మిగతా పార్టీలకు గుణపాఠం కాగలదని పేర్కొన్నారు. ఎందుకంటే ఇతర పార్టీలలో డబ్బున్నవాళ్ళకే టికెట్లిస్తుంటారని, పేదల గురించి పట్టించుకోరని వాపోయారు. |