చలనచిత్రాల్లో, టెలివిజన్ కార్యక్రమాల్లో పొగతాగే సన్నివేశాలను ప్రదర్శించకుండా విధించిన నిషేధం సమంజసమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రజానీకం హితం కోరే తామీ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తన చర్యను సమర్ధించుకుంది.
పొగతాగే సన్నివేశాలపై కేంద్రం విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో వేసిన ఓ పిటిషన్‌కు సమాధానమిస్తూ ప్రభుత్వం పై విధంగా తన వాదన వినిపించింది. చలన చిత్రాలు, ప్రకటనల్లో నటించే తారల పట్ల ప్రజలు అమితంగా ఆకర్షించబడుతారని ప్రభుత్వ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ పి.పి. మల్హోత్రా కోర్టులో వాదించారు.
అందుకే సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో పొగతాగే సన్నివేశాలపై నిషేధం విధించడం జరిగిందని ఆయన కోర్టుకు నివేధించారు. సినీతారలు, క్రికెటర్లు పొగతాగుతున్నట్టు నటిస్తే వారిని అనుకరించే యువత కూడా ఈ అలవాటుపైపు ఆకర్షింపబడుతారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. |