గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ఆలయాల కూల్చివేతను నిలిపివేసింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైన విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్ వంటి సంఘ్ పరివార్ వంటి శక్తులు తెచ్చిన ఒత్తిడికి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తలొగ్గారు. దీంతో గాంధీనగర్‌లోని అనధికార ప్రాంతాల్లో వెలసిన ఆలయాలు, మసీదులు, చర్చిల కూల్చివేతకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. గుజరాత్‌లో ఇప్పటికే 200 ఆలయాలకు పైగా భాజపా ప్రభుత్వం కూల్చి వేయగా, వీటిలో ఎక్కువగా హిందూ ఆలయాలు ఉన్నాయి. ఈ అంశంపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గుజరాత్‌లో మహ్మద్ గజనీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. గజనీ పాలనలో కూడా వందలాది హిందూ ఆలయాలను కూల్చి వేసినట్టు చరిత్ర చెపుతోంది. అలాంటి పాలనే ప్రస్తుతం గుజరాత్‌లో సాగుతోందని వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ ఆరోపించారు. అంతేకాకుండా సమస్యపై చర్చించేందుకు ఆయన నరేంద్ర మోడీతో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చల అనంతరం ఆలయాల కూల్చివేతను నిలిపివేస్తున్నట్టు మోడీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఆలయాల కూల్చివేత హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని వీహెచ్‌పీ అభిప్రాయపడింది. |