|
నారిమన్ హౌస్‌లో ఎన్‌ఎస్‌జి బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న విదేశీ పౌరులను సురక్షితంగా రక్షించేందుకు భారత ఆర్మీ శాయశక్తులా కృషి చేస్తోంది. అందుకోసం బందీలకు ఎలాంటి హాని కలుగకుండా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా... రెడ్ ఆపరేషన్ చేపట్టారు. హెలికాఫ్టర్ల సాయంతో నారిమన్ హౌస్ పైభాగంలోకి కమాండర్లు ప్రవేశించారు.
నారిమన్ హౌస్‌లోకి వెళ్ళి ఉగ్రవాదులను మట్టుబెట్టడమే ఈ ఆపరేషన్ లక్ష్యంగా కమాండర్లు ముందుకు సాగుతున్నారు. అయితే.. ఇక్కడ అనేక మంది విదేశీయులు ఉగ్రవాదుల చెరలో ఉన్నట్లు వార్తలు వస్తున్నా యి. వారిని కాపాడవలసిన బాధ్యత కూడా కమాండర్లపై ఉంది. శత్రు దేశాలపై అతి క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే నిర్వహించే రెడ్ ఆపరేషన్ జనారణ్యంలో నిర్వహించడం భారత చరిత్రలో ఇదే ప్రథమం.
ఈ నేపథ్యంలో ముంబై నగరంలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. నారిమన్ హౌస్ ప్రాంతం గ్రెనైడ్ల మోత, తుపాకీ కాల్పుల శబ్దంతో హోరెత్తి పోతోంది. హెలికాఫ్టర్ల ద్వారా ప్రవేశించిన కమాండర్లకు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. హౌస్ పైభాగంలోకి కమాండర్లు ప్రవేశించడాన్ని గుర్తించిన ఉగ్రవాదులు వారిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
దీనితో ప్రస్తుతం నారిమన్ పరిసరాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి నారిమన్ హౌస్‌లో మూడు పేలుళ్ళు సంభవించాయి. నిరంతరంగా కాల్పులు జరుగుతున్నాయి. రెడ్ ఆపరేషన్ ప్రారంభించిన వారిలో ఒక కమెండోకు గాయాలైనట్లు సమాచారం. ఇక్కడ ఉగ్రవాదుల చెరలో ఉన్న 200 మందిని తప్పించడమే ప్రధాన లక్ష్యంగా భద్రతా దళాలు మెరుపు వేగంతో ముందుకు కదులుతున్నట్లుగా తెలుస్తున్నది.
|