దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 69 సెగ్మెంట్లకు పోలింగ్ శనివారం జరుగుతోంది. మిగిలిన ఒక్క స్థానానికి డిసెంబరు 13వ తోదీన పోలింగ్ జరుగనుంది. రాజేంద్ర నగర్‌లో పోటీ చేసిన భాజపా అభ్యర్థి పురణ్ చంద్ యోగి ఆత్మహత్య చేసుకోవడంతో ఇక్కడ పోలింగ్ వాయిదా పడింది.
కాగా, ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ కోసం 10,993 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఎన్నికల బందోబస్తు కోసం 52 వేల పోలీసు బలగాలను మొహరించినట్టు ఢిల్లీ ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 1,05,82,369 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 46.98 లక్షల మంది మహిళలు ఉన్నారు.
ఈ పోటీలో 863 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. అధికార కాంగ్రెస్‌తో పాటు.. భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఎన్‌సీపీ, ఎస్‌పీతో పాటు.. మరికొన్ని చిన్నా చితక పార్టీలు తమతమ శక్తి మేరకు అభ్యర్థులను బరిలోకి దింపాయి.
ఎన్ని పార్టీలు పోటీలు ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, భాజపాల మధ్యే సాగుతోంది. ఢిల్లీలో విస్తీర్ణపరంగా అతి పెద్ద నియోజకవర్గం నరేలా, ఓటర్లపరంగా అతి పెద్దది వికాస్‌పురి, అతిచిన్న స్థానం ఢిల్లీ కంటోన్మెంట్ కావడం గమనార్హం.
పోటీలో ఉన్న ప్రముఖుల్లో మంత్రులు ఏకే.వాలియా, అరవిందర్ సింగ్ లౌవ్లీ, యోగానంద్ శాస్త్రి, రాజ్‌కుమార్ చౌహాన్, ఢిల్లీ భాజపా చీఫ్ హర్ష్ వర్ధన్, ప్రతిపక్ష నేత జగ్దీష్ ముఖి తదితరులు ఉన్నారు. |