తమిళనాడు రాష్ట్రంలో నిశా తుఫాను ధాటికి 115 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి. అధికార యంత్రాగం, మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన నిశా తుఫాను.. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి సమీపంలోని కారైక్కాల్ వద్ద తీరం దాటిన విషయం తెల్సిందే. నిశా ప్రభావం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసింది. ముఖ్యంగా కారైక్కాల్, నాగపట్టణం, కడలూరు, తిరువారూర్, అరియలూరు, చెన్నయ్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. దీంతో వేలాది గ్రామాలు నీట మునిగాయి. లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది. రాష్ట్రంలోని 2,426 గ్రామాల్లో అపార నష్టం వాటిల్లింది. దీంతో అనేక గ్రామాల ప్రజలు నీటిలో ఆవాసం చేస్తున్నామన్నారు. అలాగే రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర రాజధాని చెన్నయ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలైన టి.నగర్, మాంబాలం, వడపళని, వేలచ్చేరి, మడిప్పాక్కం, కీళ్‌కట్టలై, వలసరవాక్కం, కెకెనగర్, పెరంబూరు, వ్యాసార్‌పాడి తదితర ప్రాంతాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి. నగరానికి మంచినీటిని సరఫరా చేసే చెరువులైన పోరూరు, చెంబరంబాక్కం, పూండి చెరువులన్నీ పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువుల్లోని నీటిని వదిలి వేయడంతో వరద నీరు చెన్నయ్ నగరంపైకి వచ్చింది. కాగా, వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పర్యటించి, బాధితులను పరామర్శించారు. వరద సహాయక చర్యల నిమిత్తం కేంద్రం తగిన మొత్తంలో నిధులు అందజేస్తుదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిశా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని కేంద్రానికి నివేదిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. |