ముంబయిలో జరిగిన ఉగ్రవాదుల దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో 195 మంది చనిపోగా 300 మంది గాయపడ్డారు. దీంతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్ ఉన్నతాధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తీరప్రాంతాలు, మహానగరాల ప్రత్యేక రక్షణ కొరకు 500 కోట్ల రూపాయలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
దీంతోపాటు దేశంలోని 72 తీరప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్గత, సరిహద్దు భద్రతా విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతామండలి సలహాసంఘ సభ్యులు ఎం.కె. నారాయణన్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా, గూఢచార విభాగం డైరెక్టర్ పి.సి. హాల్దార్, అంతర్గత భద్రతావిభాగ కార్యదర్శి ఎం. ఎల్. కుమావత్ తదితర అధికారులు పాల్గొన్నారు. |