మూడు రోజులుగా ముంబైలో సాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక పోరులో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహమ్మద్ అజ్మల్ అమిన్ కసాబ్ బుధవారం రాత్రి దాడి మొదలైన కొద్ది సేపటికే ఏటిఎస్ ఛీఫ్ హేమంత్ కర్‌కారేని, ఎన్‌కౌంటర్ నిపుణుడు విజయ్ సలాస్కర్, అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టేలను కాల్చి చంపేశాడని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 11 వరకు పోలీస్ కస్టడీకి పంపించబడిన పాకిస్తాన్ జాతీయుడు కసాబ్ ఈ ముగ్గురు సమర్థ అధికారులను వాహనంలో వస్తుండగా కాల్చి చంపారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సముద్రమార్గంలో బుధవారం రాత్రి మొట్టమొదటిసారిగా 10 మంది ఉగ్రవాదులు ముంబై నగరంలోకి అడుగుపెట్టారని, రాగానే ఎవరికి వారు నిర్దేశించుకున్న దాడి ప్రాంతాల వద్దకు జంటలుగా విడిపోయారని పోలీసు వర్గాలు తెలిపాయి.తాము నిర్దేశించుకున్న ప్రాంతాలకు టాక్సీల మీద వెళ్లిన ఉగ్రవాదులు టాక్సీ కిరాయిని భారతీయ కరెన్సీలోనే చెల్లించారని, ప్రతి ఉగ్రవాది తలొక రూ.6,200లను జేబులో ఉంచుకున్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దక్షిణ ముంబైలోని గిర్గాం చౌపట్టి ప్రాంతంలో పోలీసులు ఇస్మాయిల్ ఖాన్ అనే ఉగ్రవాదిని కాల్చి చంపిన ఘటనలో బుధవారం రాత్రి అతడితో పాటు ఉన్న కసబ్ అరెస్ట్ అయ్యాడు. ఈ ఇద్దరు ఉగ్రవాదులే చత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లో మొదట కాల్పులు విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించి తర్వాత కామా హాస్పిటల్, జిటి హాస్పిటల్ వైపుగా దారి తీశారని పోలీసు అధికారులు తెలిపారు.తాజ్ హోటల్, ఓబెరాయ్ హోటల్, నారిమన్ హౌస్‌లపై దాడి చేసి అక్కడి ఉన్నవారిని బందీలుగా పట్టుకుని వారిని అడ్డుపెట్టుకుని నగరం నుంచి పారిపోవాలని తాము ముందుగా పథకం రచించుకున్నామని కసబ్ తెలిపాడు. భారతీయ వాణిజ్య రాజధానిని లక్ష్యంగా ఎంచుకుంటే అది ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని తాము భావించినట్లుగా కసబ్ వెల్లడించాడు. సముద్రమార్గంలో ముంబైలో అడుగుపెట్టిన ఈ పదిమంది ఉగ్రవాదులు అంతకు ముందుగా రెక్కీకోసం నగరంలోకి రాలేదని, ముంబై నగరంలోని ప్రముఖ ప్రాంతాలను తెలుసుకోవడానికి గూగుల్ ఎర్త్ సహాయం తీసుకున్నారని ముంబై క్రైంబ్రాంచ్ అధికారి తెలిపారు.అయితే విల్లె పార్లే, డాక్‌యార్డ్ రోడ్‌లో ఉగ్రవాదులు పేలుళ్లు జరిపిన ఘటనపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు గాను స్థానికుల సహాయం తీసుకున్నారనే అంశంపై పోలీసులు తీవ్రంగా శోధిస్తున్నారు. |