ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం రక్షణ శాఖ కార్యదర్శి విజయ్ సింగ్, త్రివిధ బలగాల అధిపతులు, ఇంటెలిజన్స్ ఛీప్‌తో సమావేశమై ముంబై దాడుల ప్రభావం గురించి చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను ఎలా నిరోధించగలం అనే అంశంపై కూడా ప్రధాని కూలంకషంగా చర్చలు జరిపారు.దేశ రక్షణ శాఖ కార్యదర్శి విజయ్ సింగ్, హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా, ఆర్మీ ఛీప్ జనరల్ దీపక్ కపూర్, నావల్ ఛీఫ్ అడ్మిరల్ సురేష్ మెహతా, ఎయిర్ ఫోర్స్ ఛీప్ మార్షల్ హోమి మేజర్, కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ అడ్మిరల్ ఆర్ ఎఫ్ కాంట్రాక్టర్, ఇంటెలిజెన్స్ ఛీప్ పిసి హల్దార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.అంతకుముందు హోం మంత్రి శివరాజ్ పాటిల్ కూడా వివిధ బలగాల ఉన్నతాధికారులతో భేటీ అయి కోస్తా తీర ప్రాంతంలో భద్రతను పటిష్టం చేయడానికి తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించారు. ఈ సమావేశానికి రక్షణ శాఖ కార్యదర్శి, నేవల్ ఛీఫ్, కోస్ట్ గార్డ్ ఛీఫ్, ఆర్మీ వైస్ ఛీఫ్ లెప్టినెంట్ జనరల్ ఎమ్ఎల్ నాయుడు, హోంశాఖ అంతర్గత భద్రతా ప్రత్యేక కార్యదర్శి ఎమ్ఎల్ కుమావత్‌లు హాజరయ్యారు. ఇకపై నేవీ, కోస్ట్ గార్డ్స్, పోలీసుల మధ్య మరింత సమన్వయాన్ని ఏర్పర్చే విషయమై ఈ సమావేశంలో నిశితంగా చర్చించారు. కోస్తా తీరం వెంబడి భద్రతను పటిష్టపర్చాలని నిర్ణయం తీసుకున్నారు. పోర్ట్ అథారిటీ వద్ద నమోదవుతున్న చేపల బోటుల వివరాలను ఇకపై పోలీసుల వద్ద కూడా నమోదు చేయవలసి ఉంటుందని తీర్మానించారు. ముంబై దాడుల్లో ఎటిఎస్, ఎన్ఎస్‌జి, రాష్ట్ర పోలీసులకు చెందిన 20 మంది ప్రాణాలు కో్ల్పోయారని, ఈ దాడుల్లో 22 మంది విదేశీయులతో సహా 183 మంది మరణించారని, 239 మంది గాయపడ్డారని కుమావత్ తెలిపారు. 9 మంది టెర్రరిస్టులు కూడా హతమయ్యారని, చెప్పారు. ఓబెరాయ్ హోటల్ నుంచి 250 మందిని, తాజ్ నుంచి 300మందిని, నారిమన్ హౌస్ నుంచి 6 మందిని సైనిక బలగాలు కాపాడగలిగాయని కుమావత్ పేర్కొన్నారు. |