యుపిఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన శక్తినంతా వినియోగించి ఉగ్రవాద భూతాన్ని నిర్మూలించాలని కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కమిటీ తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై కఠినవైఖరి అవలంబిస్తామని ప్రధాని మన్మోహన్ శనివారం శపథం చేశారు. దేశ భద్రతా యంత్రాంగాన్ని పునర్నిర్మించే వైవుగా తక్షణం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కాంగ్రెసె వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. దీంతో సిడబ్ల్యూసి మనోభావాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తగు చర్యలు చేపడుతుందని ప్రధాని హామీ ఇచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా తన భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోనని పాకిస్తాన్ గతంలో చేసిన వాగ్దానానికి కట్టుబడాల్సిందిగా కాంగ్రెస్ అత్యున్నత కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన సిడబ్ల్యూసి సమావేశానికి మన్మోహన్ హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ముంబై నగరంలో ఉగ్రవాదుల దాడుల వెలుగులో పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం గురించి పలువురు నేతలు నొక్కి చెప్పారు. |