ముంబై నగరవాసులు కొందరు తమకు సహాయం చేశారని ముంబై దాడుల సందర్భంగా పోలీసులకు పట్టుబడిన పాక్ ఉగ్రవాది అజమ్ అమీర్ కసాబ్ వెల్లడించాడు. గత మూడు రోజులుగా ఉగ్రవాద దాడితో కంపించి పోతున్న ముంబై నగరానికి చెందిన కనీసం అయిదుమంది వ్యక్తులు తమకు సహాయం చేశారని కసాబ్ తెలిపాడు.ఆశ్రయం కల్పించటం, నగరాన్ని పరిచయం చేయడం, పోలీసు స్టేషన్లు, గస్తీ కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని చెప్పడం వంటి సహాయాలను స్థానికులు ఉగ్రవాదులకు అందించారని కసాబ్ చెప్పారు. ఇలా తమకు సాయపడిన వ్యక్తుల పేర్లు కూడా అతడు చెప్పాడని తెలుస్తోంది.తాము కూడా ఉగ్రవాద దాడికి స్థానికులు సహాయపడ్డారని అనుమానిస్తున్నామని, అయితే ఇది దర్యాప్తులో ఇంకా తేలవలసి ఉందని మహారాష్ట్ర జాయంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ మారియా చెప్పారు. దాడికి సంబంధించి తమ దర్యాప్తు ఇంకా సాగుతున్నందున ఈ విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించడం భావ్యం కాదని రాకేష్ తెలిపారుపాలస్తీనా ప్రజలపై జరుపుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇజ్రేలీలపై ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రత్యేక లక్ష్యంతో తాము ఇక్కడికి వచ్చామని కసాబ్ పోలీసులకు తెలిపాడు. అందుకే తాము ఇజ్రాయల్ దేశస్తులకు ఉద్దేశించిన నారిమన్ హౌస్‌ను దాడికి లక్ష్యంగా చేసుకున్నామని చెప్పాడు. కాగా సైనిక చర్యలో చనిపోయిన కసాబ్ సహచరులలో కొందరు గతంలో నారిమన్ హౌస్‌లో బస చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.తాము మలేసియా విద్యార్థులమని చెప్పుకుని ఉగ్రవాదులు నారిమన్ హౌస్‌లో అద్దెకు గతంలో కొంత కాలం ఉండినారని కొందరు చెప్పారు. అయితే యూదులు కాని వారికి నారిమన్ హౌస్‌ను అద్దెకు ఎలా ఇచ్చారనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని రికార్డులను పోలీసులు స్వాధీనపర్చుకుని పరిశీలిస్తున్నారు. వీలైనంత ఎక్కువమందిని చంపవచ్చనే ఉద్దేశంతోటే రెండవ లక్ష్యంగా సిఎస్‌టి రైల్వే స్టేషన్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డులతో ఉగ్రవాదులు చాలా క్రెడిట్ కార్డులను తమ వెంట తెచ్చుకోవడం భద్రతా దళాలను నివ్వెరపరుస్తోంది. వివిధ బ్యాంకుల కార్డులు వీరి వద్ద ఉండటం చూస్తే ఉగ్రవాదుల వెనుక ఐఎస్ఐ హస్తం ఉందని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. |