కేంద్రమంత్రి శివరాజ్ పాటిల్ ఎట్టకేలకు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముంబై మారణహోమానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తన రాజీనామా లేఖను ఆదివారం పంపారు. అయితే.. దీనిపై ప్రధాని ఆమోదముద్ర వేయాల్సి వుంది. కాగా, పాటిల్ రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధికార వర్గాలు కూడా ధృవీకరించాయి. శనివారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పాటిల్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ అనధికార వర్గాల సమాచారం. ప్రతిపక్ష, మిత్రపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో పాటిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో దేశంలో జరిగిన పలు ప్రాంతాల్లో జరగడంతో హోంమంత్రి, తన పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. అయితే. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆశీస్సులతో పదవీగండం నుంచి తప్పించుకుంటూ వచ్చారు. కానీ.. ముంబై మారణహోమంపై సోనియా కలత చెందినట్టు చెప్పారు. అందుకే వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన పాటిల్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారని, దీంతో శనివారమే రాజీనామా చేయాలని నిర్ణయానికి పాటిల్ వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. |