కేరళ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌కు బెంగుళూరులో తీవ్ర భంగపాటు జరిగింది. దేశ రక్షణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వెచ్చించిన జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్‌జి) మేజర్ సందీప్ ఉన్నకృష్ణన్ తండ్రి నుంచి చీత్కారం ఎదురైంది. తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, అతను కేరళకు మాత్రమే చెందినవాడు కాదని సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ నిక్కచ్చిగా పేర్కొంటూ.. ముఖ్యమంత్రి ముఖంపై కొట్టేలా తలుపులు మూసేశారు.
ఈ హఠాత్ పరిణామంతో సీఎం భద్రతా సిబ్బందితో పాటు.. అచ్యుతానందన్ సైతం నిశ్చేష్టులయ్యారు. ఈ సంఘటన రాజకీయ నేతల విశ్వసనీయతకు ప్రశ్నార్థకంగా మారింది. మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే సతీమణి.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సాయాన్ని తిరస్కరించి తొలిషాక్ ఇచ్చారు.
ప్రస్తుతం సందీప్ తండ్రి ఉన్నికృష్ణన్ ఇలాగే వ్యవహరించి, రాజకీయ నేతల సానుభూతి, సంతాపాలు తమకక్కర లేదని తేల్చి చెప్పారు. ‘మాకు రాజకీయాలు వద్దు. శాంతి కావాలి’ అంటూ వారు నినదించారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ‘పోరా.. పో! కుక్కా’ అంటూ వచ్చినవాళ్లపై మండిపడ్డారు. రాజకీయ నాయకులెవరూ తన గడప తొక్కేందుకు వీల్లేదన్నారు. వారి సానుభూతులు, సంతాపాలు తమకక్కర్లేదని కుండబద్దలు కొట్టారు.
తనను కాదని రాజకీయ నాయకులెవరైనా ఇంట్లోకి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆయన హెచ్చరించారు. తన కుమారుడి సాహసాన్ని ఈ దేశమంతా కళ్లారా చూసింది. అతను ఈ దేశ పుత్రుడు. కేవలం కేరళకు చెందిన వాడు కాదంటూ.. సింహంలా గర్జించారు.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కేరళలో జన్మించారు. ఆయన కుటుంబం చాలాఏళ్ల క్రితమే కర్ణాటక రాజధాని బెంగళూరులో స్థిరపడింది. మేజర్ సందీప్ కేరళలో జన్మించినా చాలా ఏళ్ళ క్రితమే వారి కుటుంబం బెంగుళూరులో స్థిరపడ్డారు. |