తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన ప్రకటించారు. ముంబై మారణహోమం తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏ విషయంలోనూ తమపై విమర్శలు చేసే నైతిక హక్కు భాజపాకు లేదన్నారు. ఎన్డీయే హయాంలో పార్లమెంట్‌పై దాడి జరిగిందని, ఆ సమయంలో భాజపాకు చెందిన హోమంత్రి అద్వానీగానీ, ఆ పార్టీ ముఖ్యమంత్రిగానీ రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. అందువల్ల ఆ పార్టీకి ఎలాంటి హక్కు, అర్హత లేదని ఆయన దెప్పిపొడిచారు. ఇకపోతే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్ఆర్.పాటిల్ రాజీనామా చేశారని, దాన్ని ఆమోదించినట్టు చెప్పారు. తన రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపినట్టు, హైకమాండ్ తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం (సీడబ్ల్యూసీ)లోనే సమర్పించినట్టు దేశ్‌ముఖ్ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా.. తాజ్ హోటల్‌ను సందర్శించేందుకు తన కుమారుడుని వెంటబెట్టుకుని వెళ్లడంలో ఎలాంటి తప్పులేదన్నారు. అలాగే.. తన రాజీనామాపై పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. |