2011 నాటికి భారత్‌లో మరో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని భారత అణు శక్తి సంఘం ఛైర్మన్ అనిల్ కకోడ్కర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 11వ భారత్ ఎనర్జీ ఫోరం కాన్ఫరెన్స్‌లో కకోడ్కర్ గురువారం పాల్గొన్నారు. థోరియం టెక్నాలజీతో అణు శక్తిని ఉత్పత్తి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. అణు శక్తి ఉత్పత్తికి థోరియం ఉపయోగించడం తమ అంతిమ లక్ష్యమని తెలిపారు. థోరియానికి సంబంధించి అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు.
భారతదేశంలో పెద్ద మొత్తంలో థోరియం నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో నాణ్యత కలిగిన థోరియం మనదేశంలో ఉందని వివరించారు. భవిష్యత్తులో అణు శక్తి ఉత్పత్తికి థోరియం ప్రదాన ఇంధనం అవుతుందని గుర్తుచేశారు. మనదేశంలో తక్కువ మొత్తంలో యురేనియం నిల్వలు ఉన్నాయన్నారు. అణు శక్తి ఉత్పత్తిలో భారత్ దగ్గర అత్యాథునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని వివరించారు.
ప్రపంచ దేశాలన్నీ అణు శక్తి ఉత్పత్తికి దూరంగా ఉంటుంటే మనం అందుకు విరుద్ధంగా ముందుగా సాగుతున్నామని చెప్పారు. ఈ విషయంలో భారత్ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుందని కకోడ్కర్ వివరించారు. |