మధ్య భారతంగా పిలిచే మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టిన ప్రజాహిత అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ విజయానికి ఈసారి అడ్డంకిగా మారాయి. చౌహాన్ తిరిగి అధికారంలోకి రాకుండా తిరుగుబాటు నేత, మాజీ సీఎం ఉమాభారతి వేసిన ఎత్తులు పారలేదు.
మధ్య ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ప్రకటించిన 223 సీట్లలో భాజపా 137, కాంగ్రెస్ 69, ఇతరులు 17 సీట్లు గెలుచుకున్నారు. సీఎంగా చౌహాన్ మూడేళ్లుపాటు వ్యవహరించినప్పటికీ పార్టీని పటిష్టంగా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎనలేని కృషి సల్పాడని భాజపా వర్గాలు అంటున్నాయి. మధ్య ప్రదేశ్‌లో విజయం భారతీయ జనతా పార్టీ జాతీయ వర్గానికి పెద్ద టానిక్‌గా మారింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలుపుకు ఇది దోహదపడుతుందని ఢిల్లీలో వర్గాలు అంటున్నాయి.
మధ్య ప్రదేశ్‌లో ఒకప్పటి భాగమైన ఛత్తీస్‌ఘడ్‌లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా తిరిగి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో నక్సలైట్ల అణచివేత, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు రమణ్ సింగ్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. మాజీ సీఎం అజిత్ జోగీ చేపట్టిన ప్రచారం కాంగ్రెస్‌కు మరోసారి అధికారాన్ని దూరం చేసిందని పార్టీ వర్గాలే బాహాటంగా విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకుందే కాని అధికారానికి చేరువ కాలేకపోయింది. ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ప్రకటించిన 67 స్థానాల్లో భాజపా 38, కాంగ్రెస్ 27, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. |