జమ్మకాశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఫలితంగా.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మరోమారు హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే కేంద్ర మాజీ మంత్రి ఓమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి) 27 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మొత్తం 87 స్థానాలు కలిగిన అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెల్సిందే. ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభం కాగా, అధికార కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపుచ్చుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనది మొదలుకుని విజయం అన్ని పార్టీల మధ్య దోబూచులాడింది.
కాంగ్రెస్ పార్టీ 16, పిడిపి 23, ఎన్‌సి 27, భాజపా 11, ఇతరులు 10 స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఏ ఒక్క పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీని సాధించలేక పోయింది. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్.సి., కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత ఓమర్ అబ్దుల్లా సంకేతాలు పంపారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. |