సైనిక దళాలు చేసిన కొన్ని డిమాండ్‌లపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ నూతన సంవత్సర కానుకగా వారి కోరికలను మన్నించి వేతనాల పెంపు బిల్లును ఆమోదించిన విషయం విదితమే. కాని వేతనాల కోసం ప్రభుత్వంతో సైనికాధిపతులు జరిపిన పోరాటం డబ్బుకోసం కాదని ఇతర సర్వీసులతో సమానార్హత, గౌరవం కోసమేనని మాజీ నావికా దళాధిపతి అడ్మిరల్ విష్ణు భగవత్ పేర్కొన్నారు.
ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో మాజీ సైనికాధికారి కెప్టెన్ రవి, ప్రభుత్వ మాజీ కార్యదర్శి యు.సీ. అగర్వాల్‌తోబాటు భగవత్ పాల్గొన్నారు. వేతనాల విషయంలో ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని అమలు చేయకూడదని సైనిక దళాల అధిపతులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి.
అధిక వేతనాల కోసం పట్టుబట్టినంత మాత్రాన కేంద్రంపై తిరుగుబాటుగా భావించకూడదని భగవత్ అభిప్రాయపడ్డారు. ఇతర సర్వీసులతో సమాన అర్హత, గౌరవ మర్యాదలు కల్పించాలనేదే వారి డిమాండని ఆయన తెలిపారు. పౌర అవసరాలకోసం ఇప్పటివరకు 1200సార్లు సైనిక దళాలను రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు. |