దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో తీవ్రవాదం ఒకటని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దీన్ని తుదముట్టించేందుకు పొరుగుదేశం పాకిస్థాన్‌తో యుద్ధం చేయడం వల్ల సమస్యకు పరిష్కార మార్గం లభించదని ఆయన అన్నారు. అయితే దౌత్యపరంగా సమస్యకు ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు తాము కృషి చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. షిల్లాంగ్‌లో 96వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాన్ని శనివారం ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సమావేశానికి దేశ నలుమూలల నుంచి సుమారు నాలుగు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ అన్ని రంగాల్లో యువతకు అధిక ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కివక్కాణించారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం రెండు ప్రధాన సమస్యలను ఎదుర్కొంటోందని ఒకటి ఉగ్రవాదం, రెండవది ఆర్థిక మాంద్యం, ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. |