ముంబైపై దాడుల్లో పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల ప్రమేయాన్ని నిరూపించే సాక్ష్యాలతో కేంద్ర హోమంత్రి చిదంబరం అమెరికాకు వెళ్లనున్నారు. ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాదు అజ్మల్ కసబ్ వాంగ్మూలం, ఉగ్రవాదులకు పాక్ నాయకులకు మధ్య సాగిన ఫోన్ సంభాషణల రికార్డులతో పాటు ఇంకా అనేక సాక్ష్యాలను ఈ పర్యటనలో చిదంబరం అమెరికా ముందుంచనున్నారు. తద్వారా ముష్కరులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆయన ఒత్తిడి చేయనున్నారు. ఇదే విషయాన్ని హోమంత్రి స్వయంగా వెల్లడించారు. వచ్చే వారంలో నేను అమెరికాకు వెళుతున్నా. తేదీలను ఖరారు చేయాల్సి వుందని చిదంబరం తెలిపారు. ముంబై దాడులకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధారాలను సేకరించిందన్నారు. వీటిని అమెరికా ముందుంచి, ఆ దేశ అగ్ర నేతలతో చర్చలు జరుపుతానని చెప్పారు. కాగా, చిదంబరం తన పర్యటనలో యూఎస్ అంతర్గత భద్రత కార్యదర్శి మైఖేల్ చెట్రూఫ్, విదేశాంగ మంత్రి కండోలిజా రైస్, కొత్త అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులతో సమావేశం కానున్నారు. ఇదిలావుడగా భారత్‌లో అమెరికా రాయబారి డేవిడ్ మల్‌ఫోర్డ్ శనివారం హోమంత్రి చిదంబరంను కలిసి ముంబై దాడులపై చర్చించారు. |