దేశ రక్షణలో భాగంగా అవసరమైతే ఎంతకైనా తెగించేందుకు వెనుకాడబోమని ప్రధాని మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ ఉద్ధేశించి చేసినవే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. షిల్లాంగ్‌లో శనివారం 96వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలన పరస్పర సహకారంపై ఆధారపడి ఉంటుందని ఈ వాస్తవాన్ని పొరుగు దేశం పాకిస్థాన్ నాయకత్వం గుర్తించి తన వైఖరిని మార్చుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తీవ్రవాద సమస్యకు యుద్ధం పరిష్కార మార్గం కాదన్నారు. ముంబై దాడులకు సూత్రధారులను పాకిస్థాన్ భారత్‌కు అప్పగించి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయ సమాజం నుంచి పాక్‌పై ఒత్తిడి తీవ్రమైందని ప్రధాని సూచన ప్రాయంగా వెల్లడించారు. అలాగే ముంబై దాడులకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా అమెరికా పాకిస్థాన్‌కు ఇప్పటికే అందజేసిందన్నారు. |