ముంబై మారణహోమంలో పాకిస్థాన్ భూభాగానికి చెందిన ఉగ్రవాదులను నిర్థారించే సరైన ఆధారాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అగ్రనే ఎల్కే.అద్వానీ స్పష్టం చేశారు. వీటి సహాయంతో పాక్ మెడలు వంచాలని ఆయన సూచించారు. భారత్ పర్యటనకు స్పెయిన్ ఉప ప్రధాని మరియా థెరిసా ఫెర్నాండ్జ్ డీ లా వెగా తొలిసారి వచ్చారు. ఆయన సోమవారం అద్వానీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడుతూ ఉగ్రవాదంపై పాకిస్థాన్ ద్వంద వైఖరిని అవలంభిస్తోందన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం అమెరికా పర్యటనతో పాక్‌పై మరింత ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. ఇందుకోసం అంతర్జాతీయ సమాజ సాయాన్ని తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలావుండగా న్యూఢిల్లీకి స్పెయిన్ బృందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు కృషి చేస్తోంది. అంతేకాకుండా రక్షణ రంగ సహకారంపై ఆసక్తి చూపుతోంది. భారత్-స్పెయిన్ దేశాల మధ్య వాణిజ్య వ్యాపారం జోరుగా సాగుతోంది. గత 2000 సంవత్సరంలో 900 మిలియన్ డాలర్లుగా ఉన్న ఈ వ్యాపారం 2007 నాటికి 3985 మిలియన్ డాలర్లకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. ఈ రెండు దేశాల మధ్య రెండు దశాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. |