ఉగ్రవాద సమస్యపై సమగ్రంగా చర్చించేందుకు, దేశవ్యాప్తంగా నిఘా సమాచారాన్ని సమన్వయ ధోరణితో పంచుకునేందుకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించేందుకోసం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.
సిఎంల భేటీలో ఉగ్రవాద నిరోధంపై కేంద్ర రాష్ట్రాలు నిఘా సమాచారాన్ని ఎలా పంచుకోవాలి అనే విషయం పైనే ప్రధానంగా చర్చ సాగుతుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర గుప్తా చెప్పారు.
ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి పి చిదంబరం ప్రసంగించనున్నారు. ముంబై దాడుల నేపధ్యంలో ఈ సమావేశం జరుగుతున్నందున ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కీలక సమయాల్లో నిఘా సమాచార పంపిణీ ఒక్కటే ఉగ్రవాద నిరోధక యంత్రాంగంగా పనిచేయగలుగుతుందని గుప్తా చెప్పారు.
ఉగ్రవాద నిరోధానికి రాష్ట్ర స్థాయిలో ఏం చేయవచ్చు, ఆయుధాలు, సాయుధ బలగాలు, నగదు విషయంలో కేంద్రం రాష్ట్రాలకు ఎలా సహాయం చేయవచ్చు అనే అంశాలపై ఈ ఒకరోజు సమావేశం చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటుందని గుప్తా చెప్పారు.
రాష్ట్రాల పోలీసు శాఖల ఆధునీకరణకు బడ్జెట్‌ను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుప్తా చెప్పారు. అయితే కేంద్ర నిధులను పోలీసు హౌసింగ్ వంటి వాటికోసం కాకుండా ఆయుధాల కొనుగోలు, ప్రత్యేక రవాణా అవసరాలు వంటి వాటికి వ్యయం చేయవలసి ఉంటుందని తెలిపారు. |