కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు, రాజీవ్ గాంధీ-సోనియాల తనయుడు భారతదేశ భావి ప్రధానమంత్రి అయ్యే శుభ తరుణం ఇంకెంతో దూరంలో లేదని విదేశాంగ శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.చెన్నైలో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనంలో పాల్గొన్న ప్రణబ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక పదవుల్లో యువ రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఎందుకులేరన్న విలేకర్ల ప్రశ్నకు ప్రణబ్ పై విధంగా స్పందించారు.రాజీవ్ గాంధీ నలభై ఏళ్ల వయసులో ప్రధాని అయ్యారనీ, రాహుల్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని ప్రణబ్ జోస్యం చెప్పారు. కీలక పదవులను రాజకీయ నాయకుల వారసులు అలంకరించటం అనేది మన దేశ రాజకీయాల్లో సంప్రదాయంగా వస్తోందన్నారు. ప్రఫుల్ కుమార్ మహంతా తన 30వ ఏట అసోం ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైనాన్ని ప్రణబ్ గుర్తు చేశారు.ఇకపోతే... తాజాగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అబ్దుల్లాకు కూడా 38 ఏళ్ల వయసేనని ప్రణబ్ తెలిపారు. అలాగే, కెనడా పార్లమెంట్‌కు ఎన్నికయిన ప్రవాస భారతీయురాలు రూబీ ధల్లా అత్యంత పిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన మహిళగా రికార్డు సృష్టించారని ప్రణబ్ విలేకర్లకు వివరించారు. |