పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించటం భారతదేశ సంస్కృతి కాదని.. వీటిని రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప పేర్కొన్నారు. అయితే.. మంగళూరు పబ్‌లు, క్లబ్‌లలో మహిళలపై జరిగిన దాడిపై రాష్ట్ర సర్కారు సరిగ్గానే స్పందించిందని, ఘటన జరిగిన ఎనిమిది గంటల్లోపే నిందితులను పట్టుకున్నామని యడ్యూరప్ప వివరించారు.రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ పార్టీయే కావాలని తమపై బురద జల్లుతోందని యడ్యూరప్ప విమర్శించారు. పసలేని ఆరోపణలు చేయడం లాంటివి ఓ జాతీయ పార్టీకి సరియైన పద్ధతి కాదని ఆయన దెప్పిపొడిచారు. అలాగే... భారతీయ జనతాపార్టీకి, రామసేనకు ఎలాంటి సంబంధాలూ లేవని ఈ సందర్భంగా యడ్యూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్‌తో సహా 33 మందిని అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శమని ఆయన అన్నారు. ప్రభుత్వపరంగా ఇలాంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.ఇదిలా ఉంటే... కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులోని పబ్‌లు, క్లబ్‌లపై దాడులు చేయించి, 18 మంది డ్యాన్సర్లను అదుపులోకి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటేవరకు వాటిని నడిపించినందుకే తాము ఈ దాడులు జరిపినట్లు ఆ రాష్ట్ర పోలీసు వర్గాలు చెప్పడం గమనార్హం. |