రాబోయే ఐదు సంవత్సరాలలో దేశంలోని పౌరులందరికీ ప్రత్యేకమైన విశిష్ట గుర్తింపు సంఖ్య(యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్)లను కేటాయించడం జరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ వెల్లడించారు.
ఎన్నికల కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులతోబాటు ప్రతి ఒక్కరికి ఈరోజుల్లో అనేక గుర్తింపు కార్డులున్నాయి. వీటి సంఖ్యను తగ్గించి, ఒకే ఒక విశిష్ట సంఖ్యను కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గుర్తింపు కార్డు సంఖ్య ప్రాజెక్టును ప్రారంభించింది.
దీనిపై ప్రణాళికా సంఘం ఇప్పటికే ప్రాథమిక స్థాయి చర్యలను చేపట్టి, దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
భారతీయ పౌరులకు కేటాయించనున్న విశిష్ట గుర్తింపు సంఖ్యకు చెందిన కార్డు అమెరికా పౌరులకిచ్చే సోషల్ సెక్యూరిటీ నంబర్‌ను పోలివుంటుందని పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. |