ఉత్తరప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ టీవీ రాజేశ్వర్ ప్రసంగిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగానికి పదేపదే అడ్డుతగులుతూ నానా రబస చేశారు.
ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక బ్యానర్లు పట్టుకొని, మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. అయినా గవర్నర్ తన ప్రసంగాన్ని ముగింపుచుకొని అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
సమాజ్‌వాదీ ఎమ్మెల్యేలు గవర్నర్‌పై నల్ల జెండాలు, మైకులు విసిరారు. వీటిని గవర్నర్‌కు తగలకుండా భద్రతా సిబ్బంది అడ్డుగా నిలిచారు. ప్రభుత్వ అనుకూల వైఖరి కనబరుస్తున్నారని వారు గవర్నర్‌ను విమర్శించారు.
మాయావతి ప్రభుత్వానికి గవర్నర్ రాజేశ్వర్ పరోక్షంగా సహకరిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ విమర్శించిన అనంతరం ఈ సంఘటన జరిగింది. రాష్ట్ర అసెంబ్లీని ఉద్దేశించి ప్రతిపక్ష నేత హోదాలో ములాయం సింగ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఎస్పీ ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరిస్తున్నారని ములాయం వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలను మాయావతి ప్రభుత్వం తీవ్రంగా వేదిస్తోందని విమర్శించారు.
|